Friday, 21 September 2012

వివాహం - విశిష్టత

పచ్చని మామిడి తోరణాలు, ముత్యాల పందిర్లు, వేదమంత్రాలు, పట్టుచీరల రెపరెపలు, జీలకర్ర బెల్లం, మూడుముళ్లు, అక్షంతల జల్లులు, వధువు ఓరచూపులు, వరుని ఆతృత చూపులు, బంధుజనసందోహం అంతా కలిసి హిందూ వివాహ ఘట్టం. ఎక్కడచూసినా నవ్వుల తుళ్లింతలు, అమ్మల కళ్లల్లో నవ్వుల కన్నీళ్లు అంతాశోభాయమానం. ఇది ప్రతీ పెళ్లిలోనూ కనిపించే సంఘటనలే. కాని చైత్రశుక్లనవమినాడు జరుపుకొనే సీతారాముల కల్యాణానికో ప్రత్యేకత అందరినీ ఆకట్టుకొంటుంది. పండిత పామరులందరినీ కట్టి పడేస్తుంది
దశరథ మహారాజు లేకలేక కన్నబిడ్డ శ్రీరాముడు. కౌసల్య ఎన్నో వ్రతాలు , నోములు నోచి పొందిన ముద్దుల తనయుడు. అలాంటి రాముడిని విశ్వామిత్రుడు లోకకల్యాణం కోసం యాగరక్షణకు తీసుకెళ్లాడు. రాముడు తమ్మునితో కలిసి రాక్షస సంహారం చేసాడు. యాగ పరిసమాప్తి జరిగింది. శాంతి ఎల్లెడలా ఫరిడవిల్లింది.
ఇక తిరుగు ప్రయాణంలో జనక మహారాజు దగ్గరున్న శివధనుస్సు కథను తన శిష్యులకు చెప్పాడు. వారిలో ఉత్సాహం వేసింది. ధనుస్సును చూడాలనుకొన్నారు. అంతే విశ్వామిత్రులు రామలక్ష్మణులను వెంట బెట్టుకొని మిధిలకు చేరాడు. జనకుడు వారిని స్వాగతించాడు. శివధనస్సు వివరణ ఇచ్చాడు. సేవకుల సాయంతో శివధనుస్సును యాగశాలకు రప్పించాడు. రాముడు ధనస్సుకు నమస్కరించాడు. గురువాజ్ఞ పొందాడు. శివధనుర్భంగం చేశాడు. జనకుడు సంతోషితాశయంతో సీతను రామునకు అర్పించాడు. దేవతలు దుందుభులు మ్రోగించారు. మనుజులు మహోత్సావాన్ని పొందారు. సిద్ధులు, మునులు లోకాసమస్తాసుఖినోభవన్తు అనిదీవించారు.
ఆ సీతారాముల కల్యాణం లోకానికి దివ్యసందేశాన్నిచ్చింది. రాముని చరితే మానవులకు మార్గగామి అయితే సీతాకల్యాణం కోమలులకు కంఠోపాఠం కావాలి. సీతారాముల కల్యాణం నిత్యస్మరణీయం. అందులో శివధనుర్భగం ఆత్మపై విజయంటారుకొందరు. ప్రణవాన్ని వంచిన వారికి ఆత్మను అర్పించదగునుఅంటోంది ఉపనిషత్తు. ఆ ప్రణవమే ధనుస్సు. ఎంత మంది ప్రయత్నించినా చివరకు రామునకే వంగింది ఆ శివధనుస్సు. ఎందుకంటే జీవుడికి దేవుడికి ఉన్న సంబంధ చిహ్నమే ధనుస్సు. అసలు ప్రణవానికి శాస్త్రార్థ ఓంకారం, ధనుస్సు అనే కదా. అందుకే దేవుడైన రాముని చేతిలోనే విరిగిందీ శివధనస్సు.
భార్యాభర్తలు అంటే లక్ష్మీనారాయణస్వరూపాలే అంటారు. కన్యాదాన కర్త తాను కాళ్లు కడిగి కన్యాదానం చేసేది విష్ణుస్వరూపునికే అనిభావిస్తాడు. అందులో ఉన్న పరమార్థాన్ని తేట తెల్లం చేయడానికే జనకుడు ‘‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ...’’ అంటాడు. ఈమెను చేపట్టిన నీకు శుభం కలుగుతుందంటాడు. నారాయణ దత్తమైన మనస్సుకు శుభం కాక మరేమి కలుగుతుంది? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరైతే తనను ‘... నాస్తి త్వమేవ శరణం మమ’ అని అంటారో వారి యోగ క్షేమాలు అన్నీ నేను చూసుకొంటాను అని చెప్పాడు కదా. అందుకే నారాయణునికి దత్తం చేసిన మనస్సు నారాయణ స్వరూపమే అవుతుంది. అందుకే సీతారాములు అనురూపులు. సీత హృదయంలో ఉన్నదే రాముని హృదయంలోనూ ఉంటుంది. రాముని హృదయఫలకమే సీతాహృదయం. అందుకే నూతన వధూవరులను ఆశీర్వదించేటపుడు సీతారాముల లాగా ఉండమనడంలోని పరమార్థం. స్థూలకంటికి ఏక పత్నీ వ్రతం ఆచరించినా శ్రీరాముడు సూక్ష్మంగా చెప్తున్నదీ అదే. జగం, జగన్నాథుడు వేరు కాదుకదా. సీతారాములను నిత్యం స్మరించడమే కాదు వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. వారి నడిచిన దారిలోనే మనం నడవడానికి నడుం కట్టాలి. అందులో ఉన్న వివాహ విశిష్టతను తెలుసుకోవాలి.

No comments:

Post a Comment