Saturday, 23 February 2013

మనుస్మృతి (భాగం-2)

వివాహం ఎనిమిది రకాలు: అవి-బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. ఈ ఎనిమిదింటిలో పైశాచం అధమము, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు. ఈ నాలుగు వివాహాలు బ్రాహ్మణునికి మేలయినవి. అసుర, పైశాచ వివాహములు తప్ప మిగిలినవి క్షత్రియులకు సమ్మతములు. రాక్షసము తప్ప మిగిలిన వివాహాలు వైశ్య, శూద్రులకు ధర్మ శాస్త్ర విహితమే అని తెలుసుకోవాలి.
వేదాధ్యయనం చేసి, సదాచార వంతుడయిన ఒక బ్రహ్మచారిని తానుగా రప్పించి, మర్యాదలు చేసి, అలంకరించిన కన్యను అతనికి ఒసగడాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు.
జ్యోతిష్టోమము మొదలయిన యజ్ఞాలలో ఆధ్వర్యం చేసే ఋత్విజునికి కన్యను ఇవ్వడం దైవ వివాహమంటారు.
యాగాది సిద్ధికోసంగాని, కన్యకు ఇవ్వడానికిగాని రెండు ఆవులనో, రెండు ఎద్దులనో వరుని నుంచి తీసుకుని శాస్త్ర ప్రకారం వరునికి కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం అంటారు.
“మీ ఇద్దరూ కలసి ధర్మమాచరించండని చెప్పి కన్య తల్లిదండ్రులు వరుని పూజించి పిల్లనివ్వడం ప్రాజాపత్య వివాహం అంటారు.”
జ్ఞాతులకు, పిల్లకు కావలిసిన ధనం ఇచ్చి తమ ఇష్టంతో పెళ్లిచేసుకోవడాన్ని అసుర వివాహమంటారు. స్త్రీ పురుషు లొకరికొకరు ఇష్టంతో అంగీకరించి కలవడాన్ని గాంధర్వమంటారు. ఈ వివాహం కామసంబంధమైనది. మైధున కర్మ కోసం ఏర్పడింది.
కన్యక బంధువులు సమ్మతింపనప్పుడు వారిని చంపిగాని లేదా నాశనం చేసి వాళ్ళకోసం విలపిస్తున్న కన్యను బలవంతంగా తెచ్చుకోవడం రాక్షస వివాహం అంటారు.
నిద్రించే ఆమెనుగాని, మత్తులోవున్న ఆమెనుగాని, ఏమరుపాటుతోనున్న ఆమెనుగాని బలాత్కారముగా, ఏకాంతముగా క్రీడించడాన్ని పైశాచికం అంటారు. ఈ వివాహం మిక్కిలి నీచమైనది.
జలధారాపూర్వకంగా కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమం. ఉదకథారా పూర్వకంగా కన్యాదానం చేయాలన్న నియమం క్షత్రియాది తక్కిన వర్ణాల వారికి లేదు. తల్లి దండ్రులు మాట ఇవ్వడం, వధూవరులకు ఇష్టం వుంటే చాలు.
బ్రాహ్మ వివాహముచే పుట్టిన కుమారుడు పుణ్యం చేసినవాడు. అతడు తన ముందటి పది తరాల వారిని, తన తరువాత పది తరాల వారిని పాపాల నుంచి విముక్తం చేస్తాడు.
దైవ వివాహం చేసుకున్న దంపతులకు పుట్టినవాడు ముందు ఏడు తరాల వారిని,   తరువాత ఏడు తరలవారిని పాపవిముక్తులను చేస్తాడు. ఆర్ష వివాహజాతుడు ముందు వెనుకల మూడు తరాల వారిని, ప్రాజాపత్య వివాహజాతుడు “ముందు వెనుకల ఆరు తరాల వారిని ఋణ విముక్తుడిని చేస్తాడు.”
బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము మొదలైన నాలుగు వివాహాల్లో జన్మించిన పుత్రులు వేదాధ్యయన సంపత్తి వలన వచ్చిన తేజస్సు కలిగినవారై, పెద్దలకు ఇష్టమైన వారుగా జన్మిస్తారు. వీరు మంచి రూపము, గుణము, బలము గలవారై, ధనవంతులై కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూరేళ్ళు జీవిస్తారు.
రాక్షస వివాహం వలన జన్మించిన పుత్రులు క్రూరులు, అసత్యవాదులు, వేదవిరోధులు, యాగాదికర్మ ద్వేషులై వుంటారు.
భార్యను సంతోషపెట్టడమే వ్రతంగా భావించి, ఇతర స్త్రీలను కోరక భార్యను ప్రేమించాలి.
స్త్రీలకు సహజంగా పదహారు దినాలు ఋతుకాలం. అందులో మొదట నాలుగు రోజులు సజ్జన నిందితాలు. ఈ ఋతుకాలం దినాలలో మొదటి నాలుగు, పదకొండవ పదమూడవ దినాలు దాంపత్య జీవితానికి పనికిరావు. తక్కిన పది రాత్రులు ప్రశస్తమైనవి. ఈ పదిరాత్రులలో ఆరు, ఎనిమిది మొదలగు సరి రాత్రులలో స్త్రీతో కలిస్తే పుత్రులు పుడతారు, బేసి రాత్రులలో సంగమంవల్ల స్త్రీలు పుడతారు. కాబట్టి పుత్రుణ్ణి కోరుకునే వ్యక్తి సరిరాత్రులలో, పుత్రికను కోరుకునే వ్యక్తి బెసిరాత్రులలో భార్యతో కలవాలి.
వివేకి అయిన కన్యతండ్రి, వరుని నుంచి కొద్దిగా అయినా ఓలి తీసుకోరాదు. అలా ఓలి తీసుకోవడమంటే బిడ్డను అమ్ముకున్నట్లే.
కన్యకు వివాహకాలంలో ఇచ్చిన ధనాన్ని, వాహనాలను, వస్త్రాలను ఆ కన్య తండ్రిగాని, బంధువులుగాని వాడుకుంటే వాళ్ళు పాపం చేసిన వాళ్లై అధోగతి పాలవుతారు. కన్యలకు ప్రీతితో ఒసగిన ధనాన్ని వారి నిమిత్తమే ఉపయోగించాలి.
ఏ కులంలో స్త్రీలు గౌరవింపబడుడురో ఆ కులం వారిపై దేవతలు దయ గలిగి వుంటారు. ఏ కులం స్త్రీలను గౌరవించారో ఆ కులం వారు  దైవక్రియలన్నీ వృధా.
కాబట్టి ఐశ్వర్యం కోరే మానవులు ఉత్సవాలప్పుడు, వివాహలప్పుడు తోబుట్టువులు మొదలైన స్త్రీలను భూషణావాదులతో సత్కరించాలి.
ఏ వంశంలో భార్తవల్ల భార్య, భార్యవల్ల భర్త సంతోషంగా వుంటారో ఆ వంశంలో సంపద తాండవమాడుతుంది.
గృహస్థుడు చేట, రోలు, రోకలి, ఇంటిపాత్రాలు శుద్ధిచేసే ఆలుకుచుట్ట, నీళ్ళ కడవ – వీటిని ఉపయోగించడం వల్ల అయిదు హత్యాపాపములను పొందుతున్నాడు. ఈ అయిదు పాపాలను పోగొట్టుకోవడానికి అయిదు మహాయజ్ఞాలు చేయమని పండితులు గృహస్థులకు బోధించారు.
వేదాలు చెప్పడం, తాను చదవడం – బ్రహ్మయజ్ఞం, పితరులను తర్పణములతో తృప్తినోందించడం పితృయజ్ఞము. అగ్నియందు వేల్చు హోమం దైవయజ్ఞము. వైశ్యదేవము, భూత బలి-ఇవి భూత యజ్ఞము. అతిధి పూజ  మనష్య యజ్ఞము.
ఎవరు ఈ అయిదు యజ్ఞాలను వదలక యధాశక్తి ఆచరిస్తారో వారిని పై అయిదు హత్యాపాపాలు అంటవు.
దేవతలకు, భూతములకు, అతిధులకు, పితరులకు ఏ గృహస్థుడు అన్నము నొసగడో అతను జీవించివున్నా మరణించినవాడి క్రిందే లెక్క.
ఆహుతము, హుతము, ప్రహుతము, బ్రాహ్మ్యహుతము, ప్రాశితము అనునవి పంచ యజ్ఞములు. ఆహుతము అనగా జపము. హుతమనగా అగ్నిహోత్రమునందు చేసే హోమము. ప్రహుత మనగా భూతముల కోసగే బలి. బ్రాహ్మ్యహుతమనగా బ్రాహ్మణోత్తముని పూజ, ప్రాశిత మనగా పితృతర్పణము.
దారిద్ర్యంతో నిత్యం అతిధిపూజ చేయలేని బ్రాహ్మణుడు ఎల్లప్పుడు వేదాధ్యయనంపై శ్రద్ధ కలిగి వుండాలి. అగ్నిహోత్రమునందు, దైవకర్మలపై శ్రద్ధ గలవాడు చరాచర రూపమగు ప్రపంచాన్ని పోషించగలుగుతాడు. ప్రాణవాయువు నాశ్రయించి జీవులు జీవించినట్లు గృహస్థుని ఆశ్రయించి తక్కిన యాశ్రమస్థులు జీవిస్తారు.
గృహస్థుడు మిగిలిన ఆశ్రమముల వారిని వేదాధ్యయనం చేయించి, అన్న పానముల నొసగి ప్రతిరోజూ వారిని పోషిస్తున్నాడు. కాబట్టి మిగిలిన ఆశ్రమముల కన్నా గృహస్థుడు శ్రేష్టుడు.
ఋషులు, పితృదేవతలు, వేల్పులు, భూతములు, అతిథులు, వీరంతా గృహస్థుల నుంచి తమకు కావలిసినవి కోరుకుంటారు. కాబట్టి బుద్ధిమంతుడగు గృహస్థుడు వారికి కావలసినవి తెలుసుకుని సమర్పించుకోవాలి.
వేదాధ్యయనంతో ఋషులను, హోమములతో దేవతలను, శ్రాద్ధములచేత పితృదేవతలను, అన్నముతో అతిథులను పూజించాలి.
గృహస్థుడైన బ్రాహ్మణుడు శాస్త్ర ప్రకారం గోదానం చేసి ఎంత పుణ్యం పొందుతాడో అంట పుణ్యాన్ని భిక్షమొసగి పొందవచ్చును.
అతిథికి భోజనం పెట్టలేనప్పుడు పడుకోవడానికి వసతి కల్పించాలి. త్రాగడానికి నీళ్లివ్వాలి, మంచిగా మాట్లాడాలి.
ఏ గృహస్థులు ఎల్లప్పుడూ ఇతరుల ఇళ్ళల్లో భోజనాలు కోరుతుంటారో వారు మరుజన్మలలో ఆ దాతల గృహాల్లో పశువులుగా జన్మిస్తారు.
సూర్యుడు అస్తమించాక వచ్చిన అతిథిని గృహస్థుడు తిరస్కరింపకూడదు. అతిథికి భోజనం పెట్టాలి. అతిథికి పెట్టని పదార్థాలను తాను కూడా తినకూడదు. వచ్చిన అతితుల్లో గొప్పవారికి గొప్పగాను, తక్కువవారికి తక్కువగాను, సములకు సమముగాను అతిథి మర్యాదలు చేయాలి.
అతిథి అయిన బ్రాహ్మణుడు భోజనం కోసం తన కులగోత్రాలను చెప్పకూడదు. అలా భోజనం కోసం కులగోత్రాలు చెప్పేవాడు వాంతి చేసుకున్న అన్నాన్ని తినే వాడని పండితులు అంటారు.
బ్రాహ్మణ గృహంలో బ్రాహ్మణులు తప్ప మిగిలిగినవారు అతిథిలుగారు. క్షత్రియ గృహంలో బ్రాహ్మణులు, క్షత్రియులు అతిథులు. వైశ్యునికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు  అతిథులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు శూద్రుడు అతిథి కాదు. 
క్షత్రియుడు బ్రాహ్మణుని ఇంటికి వస్తే బ్రాహ్మణులు భోజించిన పిదప అతనికి భోజనం పెట్టాలి.
వైశ్యశూద్రులు బ్రాహ్మణుని ఇంటికి భోజనానికి వస్తే వారికి తమ ఇంటిసేవకులతో భోజనం పెట్టాలి.
కొత్త పెళ్ళికూతురికి, రోగులకు,  గర్భిణులకు – వీళ్ళకు అతిధులకంటే ముందే భోజనం పెట్టాలి.
బ్రాహ్మణులు, అతిథులు, సేవకులు భుజించిన పిదప దంపతు లిరువురూ భోజనం చేయాలి.
బ్రాహ్మణుడు అమావాస్యనాడు పితృ యజ్ఞమును చేసి, ఆ తరువాత పిండాన్వాహార్యకమనే శ్రాద్ధమును పెట్టాలి.
పితృదేవతలను గురించి నెలనెలా చేసే మాసిక శ్రాద్ధమును నన్వాహార్య మంటారు. ఈ మాసిక స్రాద్దములో ప్రశస్త మాంసాన్ని ఉపయోగించాలి.
ఈ శ్రాద్ధములో దేవతా స్థానంలో ఇద్దరు బ్రాహ్మణులను, పితృ దేవతా స్థానమున ముగ్గురు బ్రాహ్మణులను, లేదా దేవస్థానమునకు, పితృస్థానానికి ఒక్కొక్క బ్రాహ్మణుని భోజనానికై నియమించాలి. ఎంత ధనికుడైనా ఇంతకంటే ఎక్కువ మందిని శ్రాద్ధానికి నియమింపకూడదు.
వేదాధ్యయన మొనర్చిన బ్రాహ్మణులకే దాతలు హవ్యమును (దేవతలకు సమర్పించే భోజనం) కావ్యమును (పితృదేవతలకు సమర్పించే భోజనం) సమర్పించాలి, అట్టి ఉత్తములకు సమర్పించే హవ్య, కవ్యముల వల్ల దాతలకు ఎక్కువ ఫలితం కలుగుతుంది.
దేవతా కార్యాలలో, శ్రాద్దాదులైన పితృకార్యాలలో ఒక్కొక్క విద్వాంసుడైన బ్రాహ్మణునికైనా భోజనం పెట్టాలి. ఇలాంటి విద్వాంసులకు భోజనం పెడితేనే ప్రయోజనం ఉంటుంది. వేద మంత్రాలి తెలియని ఎంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినా ఫలితం ఉండదు.

No comments:

Post a Comment